మండలంలోని అంకుషాపూర్ గ్రామ బస్టాండ్ ఆవరణలో ఓం గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుంకుమ పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఓం గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బట్టు శేఖర్, ఉప అధ్యక్షుడు పోగుల నరేష్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అర్చకులు భాస్కర్చారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడికి ప్రత్యేక అభిషేకం, పూజలు జరిగాయి. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమ పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు వినాయకుడికి పుష్పాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో మండపం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండపం వద్ద ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామస్థులు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












