హుస్నాబాద్, 20 November
సిద్దిపేటలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
సిద్దిపేట సభ అనంతరం బస్సు కోసం వెళ్తుండగా, మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) ప్రమాదానికి గురై మృతి చెందడంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో సారవ్వ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతి నివాళులర్పించారు. అనంతరం సారవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
అదేవిధంగా, సారవ్వ మహిళా సంఘం సభ్యురాలు కావడంతో, మహిళా సంఘం సభ్యులకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.


